పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 28, 2009

బ్లాగు పుస్తకంలో నెమలీక--అభినందన మందారమాల

"నా అక్షరాలు ప్రజా శక్తులవహించే విజయ ఐరావతాలు కాదు..వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలూ కాదు"

వెన్నెల్లో ఆడుకొనే ఆడపిల్లలే అందంగా ఉంటారా? తనమానాన తన పని చేసుకొని వెళ్ళే ఆడపిల్లలు అంతకంటే అందంగా ఉంటారు..........

అయినా ఇవంటే నాకు ఇష్టం.. ఎందుకంటే ఇవి 'నా' అక్షరాలు కాబట్టి. ....

ఎవరి అక్షరాలంటే వాళ్లకి ఇష్టమే.....కానీ మన అక్షరాలని ఇష్టపడే పాఠకులు ఎంతమంది ఉంటారు?

నెమలీక అంటే ఇష్టపడని పిల్లలు ఉంటారా?  అలానే నెమలికన్నుని ఇష్టపడని తెలుగు బ్లాగర్లు ఉంటారా?

చడీ చప్పుడు కాకుండా 2009 జనవరిలో బ్లాగు వ్రాయటం మొదలుపెట్టి....ఇంతింతై.......వటుడింతై అన్నట్టు  అలవోకగా ద్విశత టపాలు పూర్తి చేసుకున్న నెమలికన్ను బ్లాగు గురించి నేను చెప్పబోవటం సాహసమే! రాసిలోనే కాదు వాసిలో కూడా మెచ్చదగ్గ తెలుగు బ్లాగుల్లో ఆయనది కూడా ఒకటి.

చిన్నప్పుడు నెమలీకని పుస్తకాలల్లో దాచి పెట్టి దానికి కొబ్బరిమట్టల మధ్య ఉండే నాచు తెచ్చిపెట్టి ఆ ఈక పిల్లలు పెడుతుందని ఎదురుచూసేవాళ్లం..గుర్తుందా...ఇలాంటి ఆనాటి మన బాల్య  జ్ఞాపకాలని ఎన్నిటినో మన కళ్ళముందు సాక్షాత్కరింపచేసి..ఒక్కసారి మనల్ని మన బాల్యంలోకి తీసుకుపోయి మనస్సుని అక్కడే వదిలి వచ్చేటట్లు చేసే రచనలు ఆయన సొంతం.

బ్లాగు ప్రారంభించిన కొద్దికాలంలోనే  ఈనాడులో ఆయన బ్లాగు గురించిన పరిచయం వచ్చింది.  ఆరునెలల్లో వంద టపాలు..  ఏ టపాకి ఆ టపా విన్నూత్నమే.. బ్లాగుల్లో దీన్ని  ఓ రిఫరెన్సు బ్లాగు అనవచ్చేమో.  సాహితీప్రియులకి మంచి విందుభోజనం మురళి గారి బ్లాగు. తెలుగులో వచ్చిన ఏ కథ గురించి అయినా నవల గురించి అయినా ఆయన దగ్గర సమాచారం దొరుకుతుందనుకుంటాను. ఒక్కసారి ఆయన దగ్గర ఉన్న  పుస్తకాలు చూడాలి అని అనుకోని తెలుగు బ్లాగర్లు ఉండరేమో!  ఇప్పటికే చాలామంది బ్లాగర్ల దృష్టి మురళిగారి గ్రంధాలయం మీద పడ్డట్టు.....గ్రంధచౌర్యానికి పథకాలు వేస్తున్నట్టు అభిజ్ఞవర్గాల భోగట్టా..మురళి గారూ జాగ్రత్త!

ఓ సినిమా గురించి చెప్పినా....ఓ నవల గురించి చెప్పినా.....ఓ కథ గురించి చెప్పినా.....నాటకాల గురించి చెప్పినా  సాధికారికంగా చెప్పగల మురళి గారు తను స్వయంగా  ఓ మంచి కథకులు.  సరళమైన భాష, వివరణాత్మకమయిన శైలి, సూటిగా చెప్పగల నేర్పు ఆయన సొంతం.  మొన్న మొన్ననే పొద్దులో ఆయన మొదటి కథ  పొడిచింది. అయినా అది మొదటి కథేంటి?....నాకయితే ఆయన బ్లాగు టపాలన్నీ కథలే.

 పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు కదా..ఆలానే మన మురళి గారు కూడా తన మూడో ఏటే రచనా రంగంలోకి అడుగు పెట్టారట.  ఆ చమత్కృతి  ఏంటో ఆయన మాటల్లోనే చదవండి.  పూర్వాశ్రమంలో ఆయన రేడియో రచనలు కూడా చేసారు.  నాటకాల గురించి మాట్లాడేవాళ్లు ఈ రోజుల్లో అరుదుగా కనిపిస్తారు.....బ్లాగుల్లో అది మరింత అరుదు.  నేను తెలుగు బ్లాగుల్లో నాటకాల గురించి మొదటిసారిగా చదివింది మురళి గారి బ్లాగులోనే.  అన్నట్టు 'అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది.. మేఘం వెనుక రాగం ఉంది.....పాట మురళి గారే వ్రాసారంట! .  ఆయన సాహిత్య పిపాస ఎలాంటిదంటే ఒకటి కాదు రెండు కాదు....ఏకంగా 18 ఏళ్లు వెతికి వెతికి మరీ ఓ పుస్తకాన్ని సొంతం చేసుకున్నారట!

ఎప్పటెప్పటివో..పదిపదిహేనేళ్లనాటివి...... వార్తాపత్రికల్లో పడ్డ అలనాటి ఆణిముత్యాల లాంటి కథలు జాగ్రత్తగా దాచిపెట్టి మనకు వినిపిస్తుంటారు.  అలా  ఎన్ని కథలు  పరిచయం చేసారో చూడండి. తిలక్, వివినమూర్తి, భానుమతి, ముళ్ళపూడి, శ్రీరమణ, డా.సోమరాజు సుశీల, కేతు విశ్వనాథ రెడ్డి, బీనాదేవి, వంశీ.. లాంటి రచయతల మంచి మంచి కథల గురించి  ఇక్కడ  చదువుకోవచ్చు.  మురళి గారికి వంశీ అంటే ఓ ప్రత్యేక అభిమానం..వాళ్ల గోదావరి జిల్లా వాడయినందుకేమో....... ఎంత అభిమానం అంటే ఆయనతో ఫోనులో మాట్లాడి ఆ ఉద్వేగాన్ని....ఆ ఆనందాన్ని మనతో ఎంచక్కా పంచుకున్నారో ఇక్కడ.

సాధారణంగా పుస్తక పఠనం మీద ఆసక్తి ఉన్నవాళ్లకి సినిమాల మీద కూడా ఆసక్తి మెండుగానే ఉంటుంది.  మురళి గారి సినిమా అనురక్తికి ఆయన  సినిమాల మీద వ్రాసిన కబుర్లే   నిదర్శనం.  ఆయన  సినిమాల మీద చక్కటి చిక్కటి విశ్లేషణలు చేస్తుంటారు.  నవతరంగంలో  కూడా ఆయన వ్యాసాలు వచ్చాయి.  అసలు ఆయన ముందు నవతరంగంలో వ్యాసాలు వ్రాస్తూ అలా అలా బ్లాగు మొదలుపెట్టారు.  కాకపోతే ఎక్కువగా కొత్త సినిమాల (80ల తరువాత సినిమాలు ) గురించే ఉంటాయి.  అప్పుడప్పుడు ఆపాత మధురాల గురించి కూడా చెప్తే బాగుంటుంది!

ఆయనకి సినిమాలు చూసే  విషయంలో ఎంత గుండె ధైర్యం..సాహసం అంటే సుమనోహరుడి ఉషాపరిణయాన్ని నిర్భయంగా చూసొచ్చి నిర్భీతితో మనకి ఆ సినిమా గురించి చెప్పేంత!  ఇన్సూరెన్సు పాలసీలు, రావాల్సిన, తీర్చాల్సిన బాకీల వివరాలన్నీ ఓ పుస్తకంలో వివరంగా రాసి పెడతారంట లేండి..అదీ ఆయన ధైర్యం.

తను వ్రాసే అమ్మ చెప్పిన కబుర్లు అయితే నాకు మరీ మరీ ఇష్టం.  అవి ఆయనకి వాళ్లమ్మ చెప్పిన కబుర్లే అయినా మనకు మన అమ్మ చెప్తున్నట్లే ఉంటాయి.  "ఒలప్పో బెండకాయి కూరొండీసినావంటే..".   అంటూ వాళ్ల పిన్ని పాడిన జముకుల కథ.....వాళ్ల అమ్మమ్మ బిస్సీ కబుర్లు,...సత్తెమ్మ సత్యభామగా  మారి  చెరువుమీద నడిచే ప్రహసనం.....గోవిందరావు జమిందారు గురించి,  టాంపండు లీలలు.......కొంపముంచిన కుంటె గేదె.....అయ్యప్పనాయుడు..హరిశ్చంద్ర వేషం......అబ్బో వాళ్ల అమ్మగారు ఆయనకి ఎన్నెన్ని కబుర్లు చెప్పారో. ... ఎంత అదృష్టవంతులో మురళి గారు మీరు..

ఇక ఆయన జ్ఞాపకాలలోకి వెళ్ళామంటే ఒక పట్టాన బయటకి రాలేము.  అవి చదువుతున్నప్పుడు నిక్కరేసుకున్న చిన్న మురళి మన కళ్ల ముందు మెదులుతాడు.  మనం కూడా మన చిన్ననాటి జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతాం.   ఈతపళ్ళు-ముంజెల బండి, పోలిస్వర్గం , తిప్పుడు పొట్లాం, మొగ్గల చీరలు,  మల్లికాసులు,  వాళ్ల సుబ్బమ్మగారి నీళ్ళావకాయ..... ఎన్నెన్ని జ్ఞాపకాలో! 

మురళి గారికి వాళ్ల బామ్మ గారంటే కాస్త కోపం అనుకుంటాను. పాపం పెద్దావిడిని ఎన్ని ఇబ్బందులు పెట్టేవారో .....అంతేనా వాళ్ల తాతయ్య చేత చివాట్లు కూడా పెట్టించేవారు.  ఇంతకీ పెద్దాయ్యాక అయినా తేలు కుడితే ఎలా ఉంటుందో  తెలిసిందా మురళి గారూ?

అందరిని హడలగొట్టే మురళి గారికి వాళ్ల నాన్నగారంటే మాత్రం మహా హడలు సుమండి.  పాపం ఆయన పదమూడో ఎక్కం కష్టాలు  పగవాడికి కూడా వద్దు అనిపిస్తాయి.  కత్తిరించిన జుట్టు మళ్ళీ తన తలమీద అతికించమని వాళ్ల మంగలి సత్యాన్ని   పీడిస్తుంటే ..వాళ్ల నాన్నగారొచ్చి నిద్రగన్నేరు కొమ్మతో వీపుమీద కధాకళి ఆడేసారట....... ఇవన్నీ మన కళ్లముందు జరిగినట్లే వర్ణిస్తారు.  ఈ జ్ఞాపకాల టపాలు చదువుతుంటే నాకు నాయిని మిట్టూరోడి కథలు గుర్తుకొస్తాయి.

మురళి గారి శైలి చదువుతుంటే నాకు అక్కడక్కడ ప్రళయ కావేరి కథలు..మా పసలపూడి కథలు  గుర్తుకొస్తాయి.  కుదిరితే ఓ కప్పు కాఫీ అంటూ కాఫీ కబుర్లు అయినా , తన బ్లాగులోని విషయ చౌర్యం గురించి కాపీ కబుర్లు అయినా..... మరే కబుర్లయినా  కళాత్మకంగా వ్రాయటం ఆయనకే చెల్లు.   చెయ్యి విరిగినట్టుంది అంటూ బ్లాగుల్లో వ్యాఖ్యల పెట్టె  పాత్ర గురించి..అది పనిచేయకపోతే వచ్చే ఇబ్బందుల గురించి  ఎలా చెప్పారో చూడండి.  అదే చేత్తో ఆషాఢమాసం గురించి అల్లరల్లరిగానూ చెప్పగలరు. 

కథలు...నవలలు....నాటికల  గురించే కాదు తన చుట్టూ ఉండే మనుషుల  గురించి కూడా కథ చెప్పినట్టే ఆసక్తికరంగా చెప్తారు.  కష్టం, బాధ్యత, మనసు, స్నేహం..లాంటి వాటి మీద  వ్యక్తిత్వవికాస తరగతులకి పనికొచ్చే మంచి విశ్లేషణాత్మక వ్యాసాలూ వ్రాయగలరు.  ఇన్ని రకాల వైవిధ్య రచనలతో పాటు బ్లాగు పరిచయాలు  కూడా చేసే మురళి గారి బ్లాగు గురించి ఎంత చెప్పినా అది అసంపూర్ణమే!

ఇక చివరిగా మురళి గారి బ్లాగుకే ప్రత్యేకమయిన ఓ విభాగం ఉంది..అదే నాయికల పరిచయం.  మధురవాణి నుంచి కజు వరకు ..... ప్రముఖ నవలల్లోని నాయికల గురించి అద్భుతంగా విశ్లేషిస్తూ పరిచయం చేస్తుంటారు.  పుస్తక పరిచయాలు సర్వసాధారణమే..కానీ బ్లాగుల్లో ఇలా అచ్చంగా నవలా నాయికల పరిచయాలు ఓ వైవిధ్యమే!

గోదావరి అంటే అమిత ఇష్టపడే ఈ గోదారబ్బాయి బ్లాగులో గోదావరి గురించిన ప్రస్తావనలు ఎక్కువగానే ఉంటాయి.   మన నేల, మన నీరు, మన పల్లె, మన కొండా కోనా...ఈ మన అనుకోవటంలో ఉండే ఆనందం..ఆ అనుభూతి ఈ మన బ్లాగు చదవటంలో కూడా ఉంటుంది.

మురళి గారు రెండువందల టపాలు పూర్తిచేసిన సందర్భంగా అభినందనలు తెలుపుతూ.... ఆయన నుండి శతాధిక టపాలు కోరుకుంటూ....

ఆయన ఎన్ని చేతులతో ఎన్ని కీబోర్డులతో వ్రాస్తారో నాకు తెలియదు కాని టపటపా టపాలు రాలిపోతుంటాయి...అందుచేత నేనీ టపా ప్రచురించే సమయానికి ఆయన రెండువందల టపాలు దాటేస్తే తప్పు నాది  కాదు!!

39 వ్యాఖ్యలు:

భాస్కర రామిరెడ్డి December 28, 2009 at 6:36 AM  

ఈ మధ్యకాలంలో , అహా కాదు కాదు, నేను బ్లాగుల్లోకొచ్చినప్పటినుండి ఒక బ్లాగరి గురించి, ఆ బ్లాగులోని విషయాల గురించి ఇంత సమగ్రంగా వ్రాసిన టపా ఇదే. సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం. మొదట మురళి గారి బ్లాగులో అది చదవలేదు/ ఇది చదవలేదు అని కామెంట్లు పెట్టే వాడిని కానీ వారు వ్రాసే నవలా పరిచయాలకు మన కామెంట్లు వ్రాసి అనవసరంగా తెలియని తనాన్ని బయట పెట్టుకోవడమెందుకని మానేసాను. హాస్యం, విషాదం, క్షమ ఇలాంటి అన్ని రకాల భావాలను అలవోకగా ఒలికించగల కలం మురళి గారిది. మొక్కుబడిగా కాకుండా సమగ్రమైన టపా అందించినందుకు మీకు ధన్యవాదాలు.

Hima bindu December 28, 2009 at 7:22 AM  

వావ్ మురళి !అందుకోండి అభినందనలు .
@సిరిసిరి మువ్వ
మీరు చేసిన పరిచయం చాల బాగుంది .ప్రతి అంశం సమగ్రంగా ,చదివినవాళ్ళం వెంటనే మరల చదివేసేయాల అన్నంత రీతిలోరాసారు .మీకు ప్రత్యెక అభినందనలు .

ఉమాశంకర్ December 28, 2009 at 8:18 AM  

చక్కని బ్లాగు. బహు చక్కని సమగ్రమైన పరిచయం..

సిరిసిరిమువ్వ December 28, 2009 at 8:26 AM  

భారారె: "వారు వ్రాసే నవలా పరిచయాలకు మన కామెంట్లు వ్రాసి అనవసరంగా తెలియని తనాన్ని బయట పెట్టుకోవడమెందుకని మానేసాను"...హ్హ..హ్హ..బాగా చెప్పారు. ఆయన వ్రాసే పరిచయాలు చదువుతుంటే..ఇన్ని పుస్తకాలు ఉన్నాయా తెలుగులో ..ఇవన్ని ఎప్పుడు చదవాలి అనిపిస్తుంది. ధన్యవాదాలు.

@చిన్ని గారు, ధన్యవాదాలు. ఇందులో నాదేమి లేదండి..అది ఆయన బ్లాగు ప్రత్యేకత. ఆ బ్లాగు గురించి ఇంకా సమగ్రంగా వ్రాయాలంటే ఇంకో నాలుగు టపాలు అవుతాయి.

ఉమాశంకర్ గారు, ధన్యవాదాలు.

మాలా కుమార్ December 28, 2009 at 8:29 AM  

టైటిల్ చూసి , పుస్తక ప్రదర్శన లో మురళి గారికి అభినందన సభ చేసారా ? అయ్యో నేను మిస్ అయ్యానే అని ఒక్క క్షణం పొరపడ్డాను సుమీ ! బాగుందండి మీ పరిచయము . మీ పరిచయము చూశాక మళ్ళీ ఒకసారి , మురళిగారి పోస్ట్ లన్నీ చదవాలని పిస్తోంది . అంతబాగా వ్రాసారు . మురళి గారి గురించి నేను చేప్పేదేముంది , నా మనసు లోని భావాలు అన్ని మీరే చక్కగా చెప్పేసారు . మురళిగారు అభినందనలు .

మరువం ఉష December 28, 2009 at 9:30 AM  

మురళీ గారికి, మీకు కూడా అభినందనలు. పైన వారి మాటలే నావీను. ఆయన బ్లాగు నాకొక వారపత్రికలా మారిపోయింది. చాలా వరకు చదువుతాను. అసలు తిప్పటం మాత్రం మానను.

sunita December 28, 2009 at 9:47 AM  

జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమక్కరలేదు అంటారు .ఐనా చంద్రుడికో నూలు పోగులా మంచి బహు చక్కటి పరిచయం. మురళిగారికీ, మీకూ కూడా అభినందనలు.

భావన December 28, 2009 at 10:04 AM  

మురళి గారు అభినందనలు. చాలా బాగా చెప్పేరు మురళి గారి నెమలి కన్ను గురించి వరూధిని గారు. చాలా మంచి బ్లాగ్ గురించి ఎంతో మంచి పరిచయం.

సత్యసాయి కొవ్వలి Satyasai December 28, 2009 at 10:21 AM  

ఆయన టపాలు చదవుతూ ఉంటా కానీ మీ పరిచయం చదివాకా ఆబ్లాగు సొగసు ఇనుమడించిందనిపించింది. పసందైన పరిచయం.

జ్యోతి December 28, 2009 at 11:42 AM  

మంచి పరిచయం. మీకు ధన్యవాదాలు. మురళి కి అభినందనలు...

లక్ష్మి December 28, 2009 at 11:45 AM  

అబ్బ కొత్తావకాయ మీద పెరుగు మీగడ వేసుకుని తిని చివరిలో ఒక్కొక్క వేలు నాక్కుంటూ ఉంటే ఎంత బాగుంటుందో అంత బాగుంది మీ పరిచయం. ఇంతకీ మురళి గారి బ్లాగు కొత్తావకాయా మీగడ పెరుగా అని మాత్రం అడక్కండి...

మురళి గారికి డబుల్ సెంచరీ అభినందనలూ, మీకేమో ఇంత చక్కటి పరిచయానికి అభినందనలు

సిరిసిరిమువ్వ December 28, 2009 at 11:54 AM  

@మాలా గారు, మురళి గారు హైదరాబాదులో ఉండి ఉంటే సభ ఏర్పాటు చేసి ఉండేవాళ్లమేమో! ధన్యవాదాలు.

@ఉషా, వారపత్రిక..భలే పోలిక పెట్టారుగా..నిజమే..ధన్యవాదాలు.

@ సునీత, భావన, సత్యసాయి, జ్యోతి ..ధన్యవాదాలు.

@లక్ష్మి గారు..."కొత్తావకాయ మీద పెరుగు మీగడ"..అబ్బ.. ఇక్కడ నోట్లో నీళ్లూరుతున్నాయి.

సుజాత వేల్పూరి December 28, 2009 at 12:27 PM  

మండువేసవిలో చల్లని పవనాలనిచ్చే నెమలీకల విశనకర్ర లాంటిది మురళి గారి బ్లాగు. It deserves this beautiful review indeed !

durgeswara December 28, 2009 at 1:27 PM  

మురళి గారికి అభినందనలు తెలపండి

Sujata M December 28, 2009 at 2:44 PM  

చాలా ఓపిగ్గా రాసారు. మంచి సమీక్ష ! ముఖ్యంగా టపా టైటిలు అదిరింది. మురళిగారిలాగే ! మీకు థాంక్స్.

ప్రియ December 28, 2009 at 3:23 PM  

Wow. Indeed I skipped it in my top blog post to write a complete one on his. But in the mean while u wrote it. Any way, I may not write this well

తృష్ణ December 28, 2009 at 4:52 PM  

చాలా బాగా రాసారు సిరిసిరిమువ్వగారూ...

Unknown December 28, 2009 at 5:37 PM  

నెమలి ఈక అని మొత్తం పించమే చూపించారు .
అందరి బ్లాగ్స్ ని సవివరం గా పరిచయం చెయ్యడమే గాని
తన బ్లాగ్ ని ఎవ్వరు పరిచయం చెయ్యరు
ఆ లోటు ని కూడా లేకుండా చేసారు .
నిజం గా మురళి బ్లాగ్ గొప్పతనం మీ సమీక్ష చూసాకే అర్ధం అయ్యింది .

మురళి December 28, 2009 at 7:40 PM  

సిరిసిరిమువ్వ గారూ,
ఏం రాయాలో, ఎలా రాయాలో అర్ధం కావడం లేదు.. నేను రాయడానికి మాటలు వెతుక్కునే పరిస్థితి వస్తుందని ఇప్పుడు మీ వల్లే తెలిసింది.. అవ్యక్తమైన భావాన్ని అక్షరాల్లోకి కుదించే ప్రయత్నం చేయలేక పోతున్నాను.. కనుచూపు మేరంతా పరుచుకున్న గోదారిని చూస్తూ మీ టపా చదివాను ఉదయం.. వ్యాఖ్యకి ఆ కంప్యూటర్ సహకరించలేదు.. ఇప్పుడు గోదారి ఇవతలి ఒడ్డునుంచి ఈ వ్యాఖ్య రాస్తున్నా.. మీ (అందరి) అభిమానపు వర్షంలోనూ తడిసి ముద్దయ్యాను.. రెండువందలవ టపా అని మీరే గుర్తు చేశారు.. నిజ్జంగా నిజం.. ఉదయం నుంచీ నిజంగానే గోదారి 'అబ్బాయి'ని అయిపోయానండీ. నా బ్లాగు గురించి నేను రాసుకోవాలన్నా ఇందులో పదోవంతు కూడా రాయలేకపోయే వాడిని.. నేను చెప్పలేక పోతున్న భావాన్ని అర్ధం చేసుకుంటారనే నమ్మకం...

Sravya V December 28, 2009 at 7:49 PM  

చాల చక్కటి పరిచయం ! మురళి గారి బ్లాగు లో ప్రొఫైల్ లో అయన వ్రాసుకున్న "ఎన్నాళ్ళు జీవించాం అన్నదానికన్నా జీవితాన్ని ఎంత ఆస్వాదించాం?అన్నది ముఖ్యమని నమ్ముతాను. " అనేది
ఆయన
చక్క గా ఆచరిస్తున్నారు అనిపిస్తుంది నాకు , దానికి కారణం ఆయన పరిచయం చేసే పుస్తకాలు , సినిమాల చాల వరకు నేను చదివినవి , చూసినవే ఐనా ఆయన పరిచయం చేసే కోణం చాల కొత్త గా ఉంటుంది .

కొత్త పాళీ December 28, 2009 at 7:57 PM  

చాలా సంతోషం. అంతే కాదు ఎంత వివాదాస్పదమైన విషయమైనా ఎంతో శాంతంతో సంయమనంతో వ్యవహరించే మృదుభాషి సర్వజన మిత్రుడీయన.
అభినందనలు మురళిగారూ.
సిసిము గారు, బారాశారండీ

సిరిసిరిమువ్వ December 28, 2009 at 9:23 PM  

@సుజాత గారు, మండుటెండలో చల్లటి విసెనకర్ర..బాగా చెప్పారు. ధన్యవాదాలు.
@దుర్గేశ్వర గారు, సుజాత గారు, రవిగారు, తృష్ణ, కొత్తపాళీ గారు, మీకందరికి నచ్చినందుకు ధన్యవాదాలు.
@ప్రియ, మీరు వ్రాయాలనుకున్నది మీరు వ్రాయండి. ఆయన బ్లాగు గురించి ఎవరమెంత వ్రాసినా అది అసంపూర్ణమే! మీ టపాలో ఆయన బ్లాగు ప్రస్తావన లేకపోవటం చూసి కించిత్తు ఆశ్చర్యానికి లోనయ్యాను..ఇదన్నమాట సంగతి.

సిరిసిరిమువ్వ December 28, 2009 at 9:31 PM  

@శ్రావ్య గారు, నిజమే ఆయన ప్రొఫైలులో వ్రాసుకున్న మాటలు నాకు ఎప్పుడు మనస్సులో మెదులుతుంటాయి. ధన్యవాదాలు.

ఊకదంపుడు December 28, 2009 at 10:32 PM  

మురళి గారు కొన్ని రోజులు తమ బ్లాగ్ కి టికెట్ కూడా పెట్టారు :)

Anonymous,  December 29, 2009 at 12:49 PM  

200 నెమలికన్నులు పోగు చేసుకుని మా మురళీధరుడు ద్విశతాక్షుడయ్యారు.
మరి సహస్రాక్షుడు ఎప్పుడవుతారా అని ఎదురు చేస్తున్నాను.
అందుకోండి. అభినందనలు.

సిరిసిరిమువ్వ December 29, 2009 at 1:09 PM  

@ఊకదంపుడు గారు, :) కొన్నిసార్లు తప్పదులేండి, అయినా త్వరగానే తీసేసారుగా!
@బోనగిరి గారు, మురళి గారి తరుపున ధన్యవాదాలు.

వేణూశ్రీకాంత్ December 29, 2009 at 1:11 PM  

ఆహా అందమైన భ్లాగుకు పసందైన పరిచయం.. చాలా బాగా రాశారు సిరిసిరిమువ్వగారు. ఇక ఆయన బ్లాగు గురించి ఎంత చెప్పినా తక్కువే చెప్పాం అనిపిస్తుంది. కొత్త బ్లాగర్స్ కు ఒక రిఫరెన్స్ లా చూపించవచ్చు మురళి గారి నెమలికన్ను బ్లాగును.

చదువరి December 29, 2009 at 6:12 PM  

విలువైన బ్లాగుకు విలువైన సమీక్ష. కేవలం ఆయన టపాలను మాత్రమే కూర్చి ఒక పుస్తకంగా వెయ్యగలిగినన్ని మంచి టపాలు ఆయన బ్లాగులో చాలానే ఉన్నాయి. అయనంత విరివిగా, అంత నాణ్యతతో టపాలు రాసేవాళ్ళు చాలా అరుదు.

నాకోటనిపిస్తుంది.. మురళి గారు ఇప్పటికే సాహితీలోకంలో సుప్రసిద్ధులై ఉండాలి. ఎప్పుడోకప్పుడు అది బయటపడుతుంది చూస్తూండండి. రేపు ఆ సంగతి బయటపడగానే అరే ఆయనే ఈయనా అని మనం ఆశ్చర్యపోతాం. (గుండెచప్పుడు దిలీప్ గారే ఒక దళారీ పశ్చాత్తాపం రాసిన దిలీపని తెలిసాక మనమంతా ఆశ్చర్యపోయినట్టు!)

జయ December 29, 2009 at 9:15 PM  

సిరిసిరిమువ్వ గారు, నెమలికన్ను ని చాలా బాగా వర్ణించారు. నేను అత్యంత అభిమానించే రచయిత మురళి గారు. మీకు అభినందనలు. మురళి గారు మీకు నా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు. మీ బ్లాగ్ లో ఇంకా ఎన్నో ఎన్నో చదవాలని కొరుకుంటున్నాను.

సిరిసిరిమువ్వ December 30, 2009 at 12:13 PM  

@వేణు, చదువరి, జయ..ధన్యవాదాలు.

మురళి గారి బ్లాగు గురించి ఎంత చెప్పినా తక్కువే..ఏకంగా ఒక పుస్తకమే వేయవచ్చు ఆయన టపాలతో.

పరిమళం December 30, 2009 at 6:09 PM  

వరూధిని గారు , ఎంతబాగా పరిచయం చేశారు ! కధలూ , కల్పనలూ , నవలలూ ,నాయికలూ , బ్లాగులూ ,జ్ఞాపకాలూ , అనుభవాలూ ,అనుభూతులూ ...ఒకటేవిటి కాదేదీ రచనకనర్హం అంటూ మనకు పరిచయం చేసే నెమలికన్నును మాకు పరిచయం చేశారు . మురళి గారికి శుభాకాంక్షలతో పాటూ మీకూ ద్విశతాభినందనలు !

Anonymous,  December 30, 2009 at 7:36 PM  

చక్కని బ్లాగును బహు చక్కగా పరిచయం చేసారు.
చదువరి గారి సందేహమే నాదీనూ. కొంపదీసి మురళీ నే " వంశీ " కాదుకదా !

Kalpana Rentala December 31, 2009 at 7:19 PM  

సిరిసిరి మువ్వ గారు,
మురళి గారి బ్లాగ్ గురించి చాలా బాగా సమీక్షించారు. నేను పెద్దగా బ్లాగులు చదవకపోవటం వల్ల ఇవన్నీ మిస్ అయ్యాను. ఇప్పుడిక నెమ్మదిగా చదవాలి. పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు.

సిరిసిరిమువ్వ December 31, 2009 at 9:19 PM  

@పరిమళం గారు, "ద్విశతాభినందనలు".....ధన్యవాదాలు.
@లలిత గారు, ఈయన (మురళి) ఆయన (వంశీ) కాదు లేండి. ధన్యవాదాలు.
@కల్పన గారు, నా బ్లాగుకి విచ్చేసినందుకు ధన్యవాదాలు. మీలాంటి రచయిత్రులు తప్పనిసరిగా చదవ్వలసిన బ్లాగు మురళి గారిది.

జయ December 31, 2009 at 11:55 PM  

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Kalpana Rentala January 1, 2010 at 12:59 AM  

మీరు చెప్పినతర్వాత కాదంటానా? ఒకటి రెండు టపాలు చదివాను కానీ మొదటి నుంచి అన్నీ చదవలేదు.. ఇక నుంచి తప్పనిసరిగా చదువుతాను. మీ కలం పేరు బావుంది.

మధురవాణి January 7, 2010 at 4:39 PM  

వరూధిని గారూ,
మనందరికీ ప్రియమైన 'నెమలికన్ను' గురించి ఎంత బాగా రాశారండీ..!
ఒక చక్కని బ్లాగుకి బహుచక్కని సమీక్ష.! మీకూ, మురళి గారికీ శుభాభినందనలు.

ప్రణీత స్వాతి February 10, 2010 at 12:27 PM  

మురళీ గారి కిరీటంలోకి రెండు వందల పదిహేడు నెమలీకలు చేరాయండీ. వాటిని చూసి, స్పృశించి, ఆనందించే అవకాశం కలిగించిన మురళీ గారికి ధన్యావాదాలు.
అలాగే ఆయన కిరీటంలోని ఆ నెమలికన్నుల అందాల్నీ అద్భుతంగా ఆవిష్కరించి మా కన్నుల పండుగ చేసినందుకు మీకు ధన్యవాదాలు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP